తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించనుంది. సోనియా బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహలక్ష్మి పథకం అమలుకు శ్రీకారం చుడుతోంది.
మహిళా ప్రయాణికుల ఛార్జీల మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. మహాలక్ష్మి పథకంపై ఉత్తర్వులు జారీ చేసింది. సిటీ, ఆర్డినరీ, మెట్రో, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించనున్నారు.
బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఈ పథకం వర్తిస్తుంది.
రేపు అసెంబ్లీ ఆవరణలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర పరిధిలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చు. కండక్టర్ కు ఆధార్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తే చాలు. పథకం అమలకు సంబంధించిన మార్గదర్శకాలను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.