ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీల ఫైల్ పై తొలి సంతకం చేశారు. తాను స్వయంగా ఇచ్చిన మాటను రేవంత్ నెరవేర్చారు. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ అపాయింట్ మెంట్ ఆర్డర్ అందించారు. ఆమె ఉద్యోగం ఇచ్చే ఫైల్ పై రెండో సంతకం చేశారు. ప్రమాణస్వీకార వేదికపైనే రజినీకి ఉద్యోగ నియామక పత్రం అందించారు.
సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత రేవంత్ తొలిసారిగా మాట్లాడారు. త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. కానీ దశాబ్ద కాలంగా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం హత్యకు గరైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుతో 4 కోట్ల ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కార్యకర్తలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. భుజాలు కాయలు కాచేలా కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తలు ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధమయ్యారని.. 10 ఏళ్లు కష్టపడ్డ కార్యకర్తలను గండెల్లో పెట్టుకుంటామన్నారు. వారికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
4 కోట్ల ప్రజలు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటైందన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం జరుగుందని భరోసా ఇచ్చారు. ప్రగతి భవన్ చుట్టూ పెట్టిన ఇనుప కంచెలు బద్దలు కొట్టించామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నానని.. ఇకపై ఎప్పుడైనా తెలంగాణ ప్రజలు ప్రగతి భవన్ లోకి రావచ్చని ఆహ్వానించారు. తమ ఆకాంక్షలను పంచుకోవచ్చని తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను ప్రపంచంతో పోటీపడే స్థాయికి తీసుకెళతామన్నారు. తాము పాలకులం కాదు సేవకులమని చెప్పారు. సేవ చేయడానికే ప్రజలు తమకు అవకాశం కల్పించారని తెలిపారు.