భారత్‌లో బుల్లెట్ రైలు (Bullet Train) ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దీనిపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంతభాగం ఆగస్టు 2026 నాటికి పూర్తికానుందని చెప్పారు. గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు 50 కిలోమాటర్ల దూరం సిద్ధమవుతుందన్నారు.
కొవిడ్ ముందుతో పోలిస్తే కొత్త రైళ్ల సంఖ్యను పెంచామని మంత్రి వెల్లడించారు. 1768 మెయిల్/ఎక్స్‌ప్రెస్ సర్వీసుల సంఖ్యను 2124కు, సబర్బన్ సర్వీసులను 5626 నుంచి 5774 వరకు పెంచామని, అలాగే ప్యాసింజర్ రైళ్ల సంఖ్య 2792 ఉండగా ప్రస్తుతం 2856కు పెరిగిందని తెలిపారు. ట్రాక్‌లపై ప్రమాదాలను నిరోధించేందుకు కవచ్ వ్యవస్థ, ఏనుగుల నిరోధానికి గజ్‌రాజ్ వ్యవస్థతోపాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో అదనపు ట్రాక్‌ల ఏర్పాటుపై ఉన్నతాధికారులతో సమావేశం జరిగింది.
దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు అహ్మదాబాద్-ముంబయి మధ్య పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ రైలు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లుగా ఉంది. ఇప్పటికే 251 కిలోమీటర్ల మేర పిల్లర్లు, 103 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగింది. బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2 గంటల 58 నిముషాల్లో అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు. బుల్లెట్ రైలు తొలి ప్రయోగాత్మక పరుగును 2026లో చేపట్టనున్నారు.
దేశంలోని ప్రధాన నగరాల మధ్య దూరాన్ని సాధ్యమైనంత తక్కువ సమయంలో చేరుకోవడానికి భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. బుల్లెట్ రైలు సిద్ధపడిన తర్వాత ప్రాజెక్టు వ్యయం, ఎన్ని సంవత్సరాల్లో దాన్ని తిరిగి రాబట్టగలం.. తదితరాలను అంచనా వేసుకున్న తర్వాతే బుల్లెట్ రైలు ప్రాజెక్టు ముందుకు కదిలింది. ప్రస్తుతం ఉన్న ట్రాక్స్ పై సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ను అందుబాటులోకి తెచ్చింది.