E-PAPER

ఢిల్లీకి చంద్రబాబు – కీలక మంత్రాంగం…

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. సీఐడీ వరుస కేసుల్లో ఉక్కిరి బిక్కిరి అవుతున్న చంద్రబాబుకు తాజాగా హైకోర్టులో బెయిల్ లభించింది. ఆ బెయిల్ పైన సీఐడీ సప్రీంను ఆశ్రయించింది. సుప్రీంలో ఈ నెల 28న ఈ కేసు విచారణకు రానుంది. ఇక..ఏపీలో ఎన్నికల దిశగా రంగంలోకి దిగేందుకు చంద్రబాబు సిద్దమయ్యారు. అందులో భాగంగా ఇప్పుడు ఢిల్లీ పర్యటన ఆసక్తి కరంగా మారుతోంది. పొత్తుల పైన క్లారిటీ వస్తుందనే అంచనాలు ఉన్నాయి.

 

ఢిల్లీకి చంద్రబాబు : టీడీపీ చీఫ్ చంద్రబాబు రేపు (సోమవారం) ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు కేసులు వాదిస్తున్న సుప్రీం న్యాయవాది సిద్దార్ధ లూథ్రా కుమారుడి వివాహ రిసిప్షెన్ కు హాజరయ్యేందుకు చంద్రబాబు సతీ సమేతంగా ఢిల్లీ వెళ్తున్నారు. సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకోనున్న చంద్రబాబు..మంగళవారం సాయంత్రం తిరిగి హైదరాబాద్ పయణం కానున్నారు. సెప్టెంబర్ 9న స్కిల్ కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన తరువాత చంద్రబాబు రాజమండ్రి జైలులో 53 రోజులు రిమాండ్ లో ఉన్నారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వటంతో బయటకు వచ్చిన చంద్రబాబు చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ఈ నెల 28 తరువాత రాజకీయ కార్యకలాపాల్లో యధావిధిగా పాల్గొన వచ్చని తీర్పు ఇచ్చింది. దీని పైన సీఐడీ సుప్రీంలో అప్పీల్ కు వెళ్లింది.

 

 

 

పొత్తులపై క్లారిటీ : చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో సీఐడీ దాఖలు చేసిన పిటీషన్ ఈ నెల 28న విచారణకు రానుంది. అదే రోజున చంద్రబాబు ఢిల్లీలో ఉండనున్నారు. ఏపీలో టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తు ఖాయం కావటంతో బీజేపీతోనూ కలిసి వెళ్లాలని భావిస్తున్నారు. జగన్ ను ఎదుర్కోవాలంటే బీజేపీ మద్దతు అవసరమనేది ఈ రెండు పార్టీల ఆలోచనగా తెలుస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ తప్పుకోవటం..పవన్ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నారనే వాదన ఉంది. అయితే, ఇప్పటి వరకు బీజేపీ నేతలు మాత్రం టీడీపీతో పొత్తు పైన స్పష్టత ఇవ్వలేదు. టీడీపీ – బీజేపీ మధ్య రాజీ చేసే బాధ్యత పవన్ తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత ఏపీలో పొత్తులపైన బీజేపీ నిర్ణయం తీసుకుంటుందనే అభిప్రాయం నెలకొంది.

 

కీలక మంత్రాంగం : ఇప్పుడు ఢిల్లీ వెళ్లున్న చంద్రబాబు..ఢిల్లీలో ముఖ్య నేతతో సమావేశం కానున్నారని విశ్వసనీయ సమాచారం. గతంలోనూ ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఆకస్మికంగా అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ సారి సమావేశం లో పొత్తుల పైన ఇక నిర్ణయం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఇటు తిరుపతి వస్తున్న ప్రధానికి సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. మర్యాదపూర్వక భేటీ జరగనుంది. డిసెంబర్ 5,6 తేదీల్లో సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఇక..ఎన్నికల కదనరంగంలోకి దిగాల్సిన సమయం రావటంతో ఈ సారి చంద్రబాబు ఢిల్లీ పర్యటన..నిర్ణయాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. చంద్రబాబు కేసులు కొనసాగుతున్న సమయంలో పొత్తుల పైన బీజేపీ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తిని పెంచుతోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram